Sunday, 05 Sep 2010
Home

Mail To Me

link_to_jagan
రాజకీయం కాదు.....ధైర్యం నింపేందుకే

తన తండ్రి మరణించారన్న విషయాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలుకోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించడానికి చేపట్టిన పర్యటనకు ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం లేదని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి తనయుడు, కడప ఎంపీ వైఎస్. జగన్‍మోహన్‍రెడ్డి పత్రికలకు ప్రకటన ద్వారా తెలియజేశారు. "దిగవంత నేత మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కలిసి ఓదార్చాలని ఎప్పుడో నిర్ణయించుకున్నా.....కానీ, కొన్ని పరిస్థితులు అనుకూలించలేదని పేర్కొన్నారు. వారిని కలిసి ఆత్మీయతను పంచుకునేందుకు బయలుదేరే క్షణాలు తనలో ఉద్వేగాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలు తనను అర్థం చేసుకుని ఆర్భాటాలకు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా కేవలం వ్యక్తిగత పర్యటనగా మాత్రమే భావించాలని కోరారు.

ఇటీవల ఖమ్మం జిల్లాలో మరియు రాజమండ్రిలో జరిగిన ఆందోళనలను ఖండిస్తూ శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు " తనకు, తన కుంటుంబానికి కాంగ్రెస్ పార్టీతో వున్న అనుబంధం రక్త సంబంధం కన్నా ఎక్కువని, తన మంచి కోరేవారెవరైనా ఇలాంటి పనులు చేయరని వారు పార్టీకి సంబంధించిన వాళ్ళయితే వెంటనే వారిని  పార్టీ నుండి బహిష్కరించాలని ఒకవేళ వారు పార్టీ వారు కాకపోతే వారిని చట్టపరంగా వెంటనే శిక్షించాలని" కోరారు. అలాగే అధిష్టానం నిర్ణయానికి అందరం కట్టుబడి వుందాం అని, ఎలాంటి ఆందోళనలు మరియు ఆత్మహత్యలకు పాల్పడవద్దని అలాచేస్తే నాన్న గారి ఆత్మశాంతించదని ఆయన అభిమానులు,మద్దతుదారులు మరియు ప్రజలను ఉద్దేశించి అన్నారు.

అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉందాం: వైఎస్ జగన్

స్వర్గీయ ముఖ్యమంత్రి శ్రీ .వైఎస్.రాజశేఖర  రెడ్డి గారి  వారసుని ఎంపికలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీసుకునే నిర్ణయానికి ప్రతి ఒక్కరం కట్టుబడి ఉందామని వైఎస్సార్ కుమారుడు, కడప ఎంపీ శ్రీ  వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు మరియు అభిమానులకు పిలుపునిచ్చారు. తనను ముఖ్యమంత్రిగా చేయాలంటూ అభిమానులు,నాయకులు మరియు  కార్యకర్తలు ఆందోళనలకు దిగడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై జరుగుతున్న పరిణామాలు ఎంతో బాధకు గురి చేస్తున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలంటూ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేవిధంగా సాగుతున్న సంతకాల సేకరణ, ప్రదర్శనలు, ఆందోళనలు వంటి కార్యక్రమాలను తక్షణం విరమించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో అధిష్టానం, ముఖ్యంగా సోనియా గాంధీ తీసుకునే నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ శిరసావహించాలని ఆయన పిలుపు ఇచ్చారు. ప్రతి పేదవాడి కంటినీరు తుడవాలని, వారి బతుకులు మెరుగు పరచాలనే గొప్ప ఆశయంతో తన తండ్రి పాలన సాగించారన్నారు. ఆ దిశగానే ఆయన పథకాలు, కార్యక్రమాలను రూపకల్పన చేశారన్నారు. వీటిని ముందుకు తీసుకువెళ్ళడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళులు అని జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

125
సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన, దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీలో మనమంతా భాగస్వాములుగా ఉండటం ఎంతో అదృష్టంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజల మేలును దృష్టిలో పెట్టుకునే సోనియా గాంధీ ఏ నిర్ణయమైనా తీసుకుంటారని దానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని జగన్ పిలుపునిచ్చారు.